కాశిబుగ్గ, జూన్ 30 : 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో నియమాలుకి విరుద్ధంగా రూ.70 కోట్లు ఖర్చు చేసి తన సతీమణి కొండా సురేఖను గెలిపించానని భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆదివారం వరంగల్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కొండా మురళీధర్ రావు తన భార్య కొండా సురేఖ గెలుపు కోసం 16 ఎకరాలు భూమి అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని సమావేశంలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
2023 ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు ఉన్నాయని వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొండ సురేఖ పొందుపరిచారని తెలిపారు. కొండా మురళి 2025జూన్ 28న ఆదివారం వరంగల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడినప్పుడు ప్రస్తుతం తనకు 500 ఎకరాల భూమి ఉందని 16 ఎకరాలమ్మి రూ.70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారరు.
కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సమర్పిస్తానని చెప్పారు. ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతామన్నారు. అడ్డదారిలో వరంగల్ తూర్పు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.