దేవరుప్పుల, మే 30 : మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. అమెరికాలోని డాలస్‌లో జూన్ ఒకటిన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాలు-తెలంగాణ ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్ పాలనను ఓడించిన ప్రజలు పశ్ఛాత్తాపపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. పాలకుర్తిలో తనను ఓడించిన ప్రజలు తప్పు చేసినట్లు బాధపడుతున్నారని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ రైతు ధనవంతుడని చెప్పుకునేవారని, నేడు వ్యవసాయం సాగునీరు లేక, రైతుబంధు అందక, పండిన వడ్లు కొనక రైతు డీలా పడినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆదాయం సగానికి సగం తగ్గిందని, ముఖ్యమంత్రే నేరుగా తెలంగాణ దివాలాతీసిందని, అప్పుపుట్టడంలేదని బాహటంగా మీటింగ్‌లో చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వరంగల్ సభ స్ఫూర్తితో విజయవంతం చేయాలని నిర్వాహకులను ఆయన కోరారు. వరంగల్ సభ అంచనాలకు మించి జరిగిందని, పోలీసుల అడ్డంకుల మధ్య సభకు 9 లక్షల మంది హాజరయ్యారన్నారు. ఒకటిన జరిగే సభకు కుటుంబాలతో వచ్చి బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సభతో తెలంగాణలోని అమెరికా వాసులంతా మళ్లీ బీఆర్ఎస్ పాలన వచ్చేలా తమ వంతు పాత్ర పోషించాలని ఎర్రబెల్లి అన్నారు.