దేవరుప్పుల, మార్చి 28: యాసంగి పంటలు ఎండి రైతులు గోస పడుతుంటే మంత్రులు వచ్చి పంపులు ఆన్ చేసి సంబురాలు జరుపుకుంటారా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన దేవన్నపేటలోని ప్రాజెక్ట్ను 14 నెలల క్రితం ప్రారంభించాల్సి ఉండగా పట్టించుకోని ఈ ప్రభుత్వం, మా పోరాటాల ఫలితంగానే నేడు మంత్రులు వచ్చి స్విచ్ఛాన్ చేశారని అన్నారు.
మోటర్లను ఆన్ చేసి నీళ్లొదిలి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని, ఎండిన ప్రతి ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించేవరకు వదలిపెట్టమన్నారు. ఇందు కోసం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, దేవరుప్పుల మండలంలో ఆరంభమైన ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తమవుతుందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ చేయడం లేదని, ఆర్థిక బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే బీమా అందడం లేదని పేర్కొన్నారు. వీటికి తోడు యాసంగి పంటలు నీళ్లు లేక ఎండ డంతో రైతు కుంగిపోయాడని, కోలుకోవడానికి ఏండ్లు పడుతుందని, ప్రభుత్వం ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తే కొంతైనా ఊరటగా ఉంటుందని ఎర్రబెల్లి అన్నారు.
ఏ గ్రామం వెళ్లినా ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయని, రైతుల బాధలు చూడలేక దేవాదుల నీళ్లు వదలాలని మంత్రులను, అధికారులను ప్రాధేయపడి, నిలదీసి, ఆందోళనలు చేసినా ప్రభుత్వం కనికరించలేదన్నారు. చివరకు పంటలు ఎండి రైతు కన్నీళ్లు పెడుతున్న సమయంలో నీళ్లు వదిలి సంబురాలు జరుపుకుంటారా అని ప్రశ్నించారు. మీరు ఆర్భాటంగా ప్రారంభించినా ఆ క్రెడిట్ తమకే దక్కుతుందన్నారు. ఎవరి ఒత్తిడితో నీళ్లొచ్చాయో రైతులకు తెలుసని ఎర్రబెల్లి అన్నారు.
దేవాదుల నీటితో రిజర్వాయర్లు నిండగానే కాల్వల ద్వారా జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నింపాలన్నారు. ఆ నీళ్లు పశువులు, పక్షులకు ఆసరాగా ఉంటాయని, సాగునీరు, తాగునీరు లభ్యత పెరుగుతుందని చెప్పారు. ముందు చూపుతో ఆలోచించి నీటి వనరులన్నీ నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. జనగామ జిల్లాకు ఏకైక వన రైన దేవాదుల నీరు సంవత్సరం మొత్తం పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్నా, 14 నెలులుగా ప్రభుత్వ నిర్వాకం, మంత్రులు అవగాహనారాహిత్యం వల్ల రైతులు భారీగా నష్టపోయారన్నారు. భవిష్యత్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.