తొర్రూరు, ఫిబ్రవరి 9 : తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే రూ. 100 కోట్లతో తొర్రూరు పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు.
తొర్రూరులో 100 పడకల ఆస్పత్రి కోసం స్థలాన్ని కేటాయిస్తే రెండేండ్లు గడిచినా ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదని మండిపడ్డారు. పట్టణంలో ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించామని, ఇప్పుడు వాటిని తానే కట్టించినట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మొండి చేయి చూపిందని దుయ్యబట్టారు. ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలను మోసం చేస్తున్నదన్నారు.
పేదల కోసం తొర్రూరులో నిర్మించిన 280 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయకుండా కాలయపన చేస్తున్నారని, ఇండ్ల కోసం పోరాటం చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులోని 16 వార్డులను బీఆర్ఎస్ గెలుస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.