ఐనవోలు, ఏప్రిల్ 9 : గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగకు లక్షలాది మంది దండులా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రజతోత్సవ మహాసభ సందర్భంగా మండల ఇన్చార్జీలు గుజ్జ గోపాల్‌రావు, ఇండ్ల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు ఐనవోలు మండలం నుంచి 2 వేల మందికి తగ్గకుండా తరలించాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు.
కేసీఆర్ సీఎంగా లేకపోతే రాష్ట్రం ఎలా ఆగమవుతున్నదన్నది ప్రజలకు అర్థమవుతున్నదన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, ఎడారిగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలంగా మార్చాడన్నారు. సాగు, తాగు నీరు, ఉచితంగా 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. రేవంత్‌రెడ్డి మోసపూరిత మాటలు నమ్మిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ఇప్పుడు కేసీఆర్‌ను ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు టికెట్లు కేటాయిస్తామన్నారు. చాలా మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు చూస్తున్నారని, స్థానిక నాయకత్వం ఆమోదం లేకుండా చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఐనవోలు శివారు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గూడ లింగారెడ్డి బీఆర్ఎస్లో చేరగా ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, డైరెక్టర్లు కుమార్, భూపాల్‌రెడ్డి జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మాజీ సర్పంచులు సురేశ్, స్వామి, సదానందం, కొమురయ్య, మాజీ ఎంపీటీసీ రాజు, ఆత్మ జిల్లా కమిటీ మాజీ డైరెక్టర్లు దేవేందర్, రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.