పర్వతగిరి, ఏప్రిల్ 7 : ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు లక్షలాదిగా తరలి వెళదామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలోని ఆయన నివాసంలో రజతోత్సవ సభకు జన సమీకరణపై ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నదన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని పేరొన్నారు.
కేసీఆర్ సార్ ముందుచూపుతో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే, ఈ ప్రభుత్వం కనీసం ఆ గ్రామ పంచాయతీలకు బిల్లులు చెల్లించేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు. రేవంత్రెడ్డి ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయి కాంగ్రెస్కు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారని వారిని చైతన్యవంతం చేయాలన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి మనం అండగా నిలిచి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని వచ్చేది మన ప్రభుత్వమే కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే దిశగా అందరం కష్టపడాలన్నారు.
పార్టీ బలోపేతం కోసం పాటుపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. రజతోత్సవ మహాసభను సమష్టిగా విజయవంతం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పర్వతగిరి పిఎసిఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ లూనావత్ పంతులు, కార్పొరేటర్ చింతల యాదగిరి, తాజా మాజీ సర్పంచులు మాలతీ సోమేశ్వర్ రావు, అమ్మడగాని రాజు, చిన్నపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్, భానోత్ వెంకన్న నాయక్, ఈర్య నాయక్, వీరన్న, దేవేందర్, ఎంపీటీసీ సభ్యులు మాడుగుల రాజు, మోహన్ రావు, కాట్రోజు మౌనిక రాజు, సుభాషిని వాసు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బుర శ్యామ్ గౌడ్, సోషల్ మీడియా నాయకులు భాసర్ తదితరులు పాల్గొన్నారు.