పాలకుర్తి/పెద్దవంగర (తొర్రూరు), డిసెంబర్ 22 : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. గ్రామాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదన్నారు. బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పట్టుదలతో పనిచేయాలన్నారు. సోమవారం పాలకుర్తి, తొర్రూరు మండలాల్లో నూతన సర్పం చ్, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరై, వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాలకుర్తిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సగానికి పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్‌లను గెలిపించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడినా, బీఆర్ఎస్ మద్దతుదారులను బెదిరింపులకు గురిచేసినా పార్టీ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధిపొందిందని మండిపడ్డారు. కౌంటింగ్‌లోనూ ఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దన్నారు. బీఆర్ఎస్కు ద్రోహం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. నూతన సర్పంచ్‌లు బాధ్యతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఉప సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పాలకుర్తి, తొర్రూరు మండలాధ్యక్షులు పసునూరి నవీన్, సీతారాములు, మాజీ ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, చిన్న అంజయ్య, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, సీనియర్ నాయకులు రాపాక ఆశోక్, జర్పుల బాలునాయక్, బానోత్ మహేందర్, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయానాగన్న, పట్టణ అధ్యక్షుడు కడుదుల కరుణాకర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, గునిగంటివాసురావు, కొసన సోమిరెడ్డి, పోశాల వెంకన్న, మహబూబాబాద్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.