తొర్రూరు, జూన్ 22 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, ఇందుకోసం శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలిచ్చి ప్రజలను తప్పుదారి పట్టించిందని, అధికారంలోకి వచ్చాక ఒకటీ సరిగా అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాట్లకు నాట్ల కు మధ్య రైతుబంధు అందించారన్నారు.
కానీ కాం గ్రెస్ ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నదన్నారు. అయితే మధ్యలో రెండుసార్లు భరోసా ఇవ్వలేదని, దీనిని రైతులకు అర్థమయ్యేలా చాటి చెప్పాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందన్నారు. తమను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతులు, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల సీనియర్, యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎర్రబెల్లి తొర్రూరు పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండ నర్సయ్య, సర్వే రమేశ్ కుటుంబాలను పరామర్శించి, వారికి పార్టీ తరఫున సహాయ సహకారాలందిస్తానని భరోసా ఇచ్చారు.