రాయపర్తి : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు ఉసిల్ల దండువలె తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో భారీగా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నరసింహ నాయక్ అధ్యక్షతన ఎల్కతుర్తి బహిరంగ సభకు జన సమీకరణ పై మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎల్కతుర్తి సభ విషయమై మండలంలోని అన్ని గ్రామాలలో గులాబీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గత 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు సమస్యలతో సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. అన్నదాతలు అరిగోస పడుతుంటే..నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. సభకు భారీగా తరలించేలా సన్నాహాలు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, కర్ర రవీందర్ రెడ్డి, బొమ్మెర వీరస్వామి, లేతాకుల రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బండి రాజబాబు, భూక్య బద్రు నాయక్, దేశ గాని ఉపేందర్, పులి సోమయ్య గౌడ్, వీరమనేని సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.