లక్నో, ఫిబ్రవరి 11: ‘నా కుమార్తె హఠాత్తుగా నాగిని (పాము)గా మారిపోయి అదృశ్యమైంది. దయుంచి ఆమె ఆచూకీని కనుక్కోండి’ అంటూ ఒక వ్యక్తి బోరుబోరున విలపిస్తూ యూపీలోని ఔరయ్యా జిల్లాలోని పోలీసులను వేడుకున్నాడు. దీంతో పోలీసులు అతని ఇంటికి చేరుకుని పరిశీలించగా, కుమార్తె పడుకునే మంచంపై ఒక పాము కుబుసం కన్పించింది.
దీంతో ఆమె నాగినిగా మారిపోయిందని, మానవ శరీరాన్ని విడిచిపెట్టి పాముగా మారిపోయిందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. సోమవారం హఠాత్తుగా ఆమె అదృశ్యం కావడంతో ఆమె నాగినిగా మారిపోయిందని, అక్కడ ఉన్న కుబుసమే దానికి నిదర్శనమని చుట్టుపక్కల వారు ప్రగాఢంగా విశ్వసించినా.. పోలీసులు మాత్రం నమ్మలేదు.
యువతి అదృశ్యంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెకు సొంతంగా సెల్‌ఫోన్ లేని విషయాన్ని గుర్తించారు. అయితే తన తల్లి ఫోన్ నుంచి ఆమె ఎవరితోనో తరచూ మాట్లాడిన విషయాన్ని గమనించి ఆరా తీయగా, అది ఒక యువకుడి ఫోన్ నంబర్‌గా గుర్తించారు.
అంతేకాకుండా ఆమెకు వివాహం చేయడానికి తల్లిదండ్రులు సంబంధాలు చూసినా ఆమె తిరస్కరించిన విషయాన్ని తెలుసుకున్నారు. ఎట్టకేలకు ఆ యువకుడి ఆచూకీని కనుగొనగా, ఆ యువతి కూడా అతనితో పాటే దొరికింది.