Sleeplessness | బిజీ జీవనశైలి, కఠినమైన డెడ్లైన్లు, టెక్నాలజీ అధిక వినియోగం, చదువు, సామాజిక ఒత్తిళ్లు నిద్ర నాణ్యతను, పరిమాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో నిద్రలేమి సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలా మంది అవసరమైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పనులను ముందుకు తీసుకెళ్లడం వల్ల రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇన్సోమ్నియా (నిద్రలేమి) లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులలో 29% మంది నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటే, మహిళల్లో అది 38% వరకు ఉంది. చిన్న సమస్యగా తీసుకునే నిద్రలేమి వాస్తవానికి పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కరోజు సరైన నిద్ర లేకపోయినా దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. దృష్టి లోపం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, ఒత్తిడి పెరగడం, తలనొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, రోడ్డు ప్రమాదాలు వంటి భద్రతా సమస్యలు కూడా పెరుగుతాయి.
దీర్ఘకాలంగా రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. నిద్ర శరీరంలోని రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మెటబాలిక్ సమస్యలపైనా నిద్ర ప్రభావం చూపుతుంది. ఆకలిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత నిద్రపై ఆధారపడి ఉంటుంది. నిద్రలేమి వల్ల ఆకలి పెరగడం, బరువు పెరగడం, స్థూలకాయం, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమి రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. నిద్ర సమయంలో శరీరం సైటోకైన్స్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, ఇవి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు అవసరం. సరైన నిద్ర లేకపోతే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు సులభంగా వస్తాయి, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
మానసిక ఆరోగ్యంపై కూడా నిద్ర ప్రభావం గణనీయంగా ఉంటుంది. నిద్రలేమి డిప్రెషన్, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలను పెంచుతుంది. ఇదే సమయంలో ఈ మానసిక సమస్యలు కూడా నిద్రను దెబ్బతీస్తాయి. ఇక మెదడు ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. నిద్ర సమయంలో మెదడులోని టాక్సిన్లు, ముఖ్యంగా అల్జీమర్స్‌కు కారణమయ్యే బీటా-అమైలాయిడ్ తొలగించబడుతుంది. సరైన నిద్ర లేకపోతే ఈ ప్రక్రియ దెబ్బతిని న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ప్రజల ఆరోగ్యంపైనా నిద్ర ప్రభావం ఉంది. హార్మోన్ల ఉత్పత్తి సరైన స్థాయిలో ఉండాలంటే మంచి నిద్ర అవసరం. దీర్ఘకాల నిద్రలేమి వల్ల పురుషులు, మహిళల్లో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిద్ర నాణ్యత తగ్గిందని గుర్తించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఉదయం లేవగానే అలసటగా ఉండటం, తలనొప్పులు, చిరాకు, ఏకాగ్రత లోపం, ఆకలి పెరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, నిద్రపట్టకపోవడం, మధ్యలో మేలుకోవడం, పగటి సమయంలో అధిక నిద్ర రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.
నిద్ర నాణ్యత మెరుగుపరచడానికి కొన్ని సులభమైన సూచనలు పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గది చల్లగా, నిశ్శబ్దంగా ఉండేలా చూడాలి. పడుకునే ముందు ఒక గంటపాటు మొబైల్, టీవీ వాడకం తగ్గించాలి. రాత్రి సమయంలో ఎక్కువగా తినడం, కాఫీ, మద్యం తీసుకోవడం మానుకోవాలి. ధ్యానం, యోగా వంటి రిలాక్సేషన్ పద్ధతులు ఉపయోగపడతాయి. నియమిత వ్యాయామం కూడా నిద్రకు సహాయపడుతుంది. నిద్రను నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. రోజువారీ పనితీరు మెరుగుపడాలంటేనే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా సరైన నిద్ర చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.