వికారాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 71.82 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 77.10., అత్యల్పంగా తాండూరు మున్సిపాలిటీలో 67.54 శాతం పోలింగ్ నమోదయింది. జిల్లాలో 1,70,379 మంది ఓటర్లుండగా.. 1,22,360 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల తర్వాతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో సాయంత్రం 5 గంటల వరకు 71.82 శాతం పోలింగ్ నమోదుకాగా.. పరిగి మున్సిపాలిటీలో 77.10., కొడంగల్‌లో 75.81., వికారాబాద్‌లో 74.35., తాండూరు మున్సిపాలిటీలో 67.54 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ నేపథ్యంలో పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పరిగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఓటేసేందుకు అడ్డుకోవడంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. అదే మున్సిపాలిటీలోని 18వ వార్డులో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదే మున్సిపాలిటీలోని 13వ వార్డులో కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి నిలదీయడంతో వాగ్వాదం జరిగింది.
మరోవైపు వికారాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ కేంద్రం వద్దనే దర్జాగా డబ్బులు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా పట్టించుకోని పోలీసులు.. బీఆర్ఎస్ అభ్యర్థులను, నాయకులను ఇబ్బందులకు గురిచేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని ఓ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటికెళ్లి ఓ పోలీస్ అధికారి బెదిరించినట్లు తెలిసింది. అంతేకాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి కారులో డబ్బులు పెట్టి కేసు చేసేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పోలింగ్ ముగిసిన అనంతరం పోలీస్ ఎస్కార్ట్ నడుమ ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు గుర్తించిన స్ట్రాంగ్‌రూంలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. రేపు (ఈ నెల 13న) మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
కొడంగల్ మున్సిపాలిటీలో సీఎం రేవంత్‌రెడ్డి., పరిగి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దంపతులు., వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు, కలెక్టర్ ప్రతీక్‌జైన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బ్యాలెట్ బాక్సుల తరలింపు
పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను జిల్లా ఎన్నికల యంత్రాంగం పరిగి మున్సిపాలిటీకి సంబంధించి పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నం.1 ఉన్నత పాఠశాలకు, వికారాబాద్‌కు సంబంధించి వికారాబాద్‌లోని శ్రీఅనంతపద్మనాభ కాలేజీ, తాండూరుకు సంబంధించి తాండూర్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్, కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి తరలించారు.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 95 వార్డులకు పోలింగ్ జరుగగా 71.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. 1,70,379 ఓట్లుండగా, 1,22,360 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుషులు-60,485(72.28 శాతం) మంది ఓటర్లు, మహిళలు-61,847(71.36 శాతం) ఓట్లు పోలయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. చెదురుముదురు సంఘటనలు మినహా ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 78.52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నించారు. జిల్లాలో 1,76,023 ఓట్లుండగా.. 1,38,222 ఓట్లు పోలయ్యాయి. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులుండగా.. అత్యధికంగా 84.74 శాతం., షాద్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా.. స్వల్పంగా 75.7 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 7, 14 వార్డుల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మిగతా మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

