హైదరాబాద్, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ): రైతుల శ్రేయస్సే ధ్యేయమంటూ గొ ప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులను సం ఘటితం చేయడంతోపాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేసింది. ఇందుకు గాను రూ.600 కోట్లతో క్లస్టర్‌కు ఒకటి చొప్పున 2,601 రైతు వేదికలను ని ర్మించింది. వీటిలో రైతులకు కావల్సిన మౌ లిక సదుపాయాలను కూడా కల్పించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు వేదికలను పట్టించుకోక శిథిలావస్థకు చేరాయి.
లబ్ధి కావాలి.. కానీ సౌకర్యాలు కల్పించరు
రైతు వేదికల ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. వాటిని బాగు చేసేందుకు మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రైతు వేదికలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుతం రైతువేదికల్లో రైతులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా కల్పించలేని దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ పేరుతో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు సైతం పాల్గొంటున్నారు. పథకాలపై విస్తృత ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. రైతునేస్తం కార్యక్రమాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
గతంలో ఏర్పాటు చేసిన టీ-ఫైబర్ కనెక్షన్ ఉన్నప్పటికీ దాని నిర్వహణ గాలికివదిలేయడంతో ఏఈవోలే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి వస్తున్నది. వేదికలకు వచ్చిన రైతులు, ఏఈవోలే వేదికలను శుభ్రం చేసుకుంటున్నారు. రైతునేస్తం కార్యక్రమానికి వచ్చేందుకు రైతులు ఇష్టపడటం లేదు. అయితే రైతులు తక్కువగా హాజరు తగ్గడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సైతం ఏఈవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే వసతులలేమితోనే రైతులు రావడానికి ఇష్టపడటం లేదని సదరు ఏఈవోలు మంత్రికి చెప్పినట్టు సమాచారం. ప్రతి ఏఈవో కనీసం 50 మందిని తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సౌకర్యాలు కల్పించకుండా రావాలంటే ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు.
భారమంతా ఏఈవోలపైనే
రైతు వేదికల నిర్వహణ నిధులపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. రెండేండ్లుగా నయాపైసా కూడా ఇవ్వడం లేదు. దీంతో రైతువేదికల నిర్వహణ భారం మొత్తం ఏఈవోలపైనే పడుతున్నది. సర్కార్ నుంచి నిధులు రాకపోవడంతో ఆ ఖర్చంతా ఏఈవోలే భరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండేండ్ల కాలంలో సుమారు రూ. 90వేల నుంచి రూ. లక్ష వరకు సొంత డబ్బులు ఖర్చు చేసినట్టు ఓ ఏఈవో వాపోయాడు. ప్రభుత్వ ఒత్తిడితో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో దాదాపు ఏఈవోలందరికీ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతువేదికల్లో కార్యక్రమాల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని ఏఈవోలు డిమాండ్ చేస్తున్నారు.