రాయపర్తి, మే 24 : కేంద్రం, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన పాపాలను పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కడుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం మండలంలోని ఊకల్ గ్రామ శివారులో కొండాపురం (కొండాపురం, గట్టికల్, పానీష్తండా), ఊకల్ (ఊకల్, బాలాజీతండ, జగన్నాథపల్లి, దుబ్బతండా) గ్రామాల ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోకపోగా ఇక్కడి సహజవనరులను తమ ప్రాంతానికి దోచుకుపోయారని ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రేక్షకపాత్ర వహించాయే తప్పా తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవించలేదని పేర్కొన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అన్ని రంగాల్లో అగ్రపథం..
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని, రైతులు, ప్రజలు పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలసపోయిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటే గుండెల్లో వణుకు పుడుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత పదేళ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని వివరించారు. బీఆర్ఎస్ పరిపాలనలో అన్ని రంగాల్లో అగ్రపథాన నిలించిందన్నారు.
పథకాలను వినియోగించుకోవాలి
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ సాధ్యమని మంత్రి తెలిపారు. ఆయన నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్షగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ దార్శనికత, దూరదృష్టి, ఆలోచనా సరళి దేశాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాయనే విశ్వాసం ప్రజల్లో మెండుగా ఉన్నట్లు వివరించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పాలకుర్తి నియోజకవర్గంలోని సకలవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలతో మంత్రి వేర్వేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలందరి అభిప్రాయాల మేరకు గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోదాటి దయాకర్‌రావు, చిన్నాల వనజ, భూక్యా భద్రూనాయక్, కుంచారపు హరినాథ్, బానోత్ కౌసల్య, గూడెల్లి శ్రీలత, నార్లాపురం రాజు, దేదావత్ కమలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, నాయకులు పూస మధు, గబ్బెట బాబు, నాగపురి రాంబాబు, రావుల వెంకట్‌రెడ్డి, చెవ్వ కాశీనాథం, చిన్నాల శ్రీనివాస్, రఘు, బైరు యాకయ్య, అనంతుల కృష్ణారెడ్డి, ఎద్దు రమేశ్, గుడిపూడి సత్యనారాయణరావు, తేరాల యాకయ్య, ముత్తడి సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.