దేవరుప్పుల, ఏప్రిల్ 17: ‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కొనుగోళ్లు లేక ఎండలో దీనంగా ఉన్న రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ‘ఇదేం ప్రభుత్వం.. ధాన్యం కొంటలేదు.. రైతులను గోస పెడుతున్నది..’ అని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెయ్యి క్విం టాళ్ల వరకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఒక్క బస్తా కూడా తూకం వెయ్యకపోతే రైతుల పరిస్ధితి ఏమిటని కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. ‘ఆరుగాలం కష్టించి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముదామని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రైతులను ఎండపాలు చేస్తున్నది. వడగండ్ల వాన పడితే గింజ చేతికి రాదు. మహిళా రైతులు ఎర్రటెండల బాధపడుతున్నరు.. ఇగ ఎన్నడు కొంటరు. ఎన్నడు పైసలేస్తరు..’ అని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూతో ఫోన్లో మాట్లాడారు. ‘సారూ.. రైతులు ఆగమైతుండ్రు. వడ్లు తూకం వేయండి..’ అని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇదే రోజు నుంచి తూకం మొదలు పెడ తాం అని తెలపడంతో ఈ విషయాన్ని రైతులకు ఎర్రబెల్లి వివరించారు.
పది రోజుల నుంచి ఎండల చస్తున్నం..
ఆరు డబ్బల ఒడ్లు ఈ కేంద్రంల పోసి పది రోజులైంది. తెల్లారితె నేర్పుడు, రాత్రి రాసిపోసుడు. ఎండల చస్తున్నం. తూకం ఏస్తలేరు. వడ్లల్ల తేమ లేకుండ చేసినం. వచ్చి చూసిండ్రు. మంచిగనే ఉన్నయన్నరు. జోకుతలేరు. బైట అమ్ముదామంటె అడ్డికి బావుసేరు అడుగుతుండ్రు. ఇక్కడ ధర మంచిగొస్తదని పోస్తే గోస పెడుతుండ్రు. ఇంత అధ్వానం ఎన్నడు లేదు. ఈ ఎండలకు ఇట్లనే తిప్పితె దవఖాన్ల పాలైతం.
-నర్ర శోభ, రైతు, దేవరుప్పుల
రైస్‌మిల్ కేటాయిస్తే
కొనుగోళ్లు మొదలు పెడుతం
రైతులు వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యం ఇప్పటికే ఈ కేంద్రంల పోసిండ్రు. మాయిశ్చర్ చూసినం. ఎక్కువ కుప్ప లు ఎండినయే ఉన్నయ్. ఇంత వరకు రైస్ మిల్లు కేటాయించలేదు. ఏ మిల్లో అధికారులు తెలిపితే వెంటనే తూకం మొదలు పెట్టి వెంటవెంటనే లారీలల్ల తరలిస్తం. అంత సిద్దంగ ఉంది. మిల్లు కేటాంచంగనె పనులు మొదలుపెడుతం. అధికారులు ఈరోజు తెలుపుతమన్నరు.
– ధరావత్ రాజేందర్,
పీఏసీఎస్ కేంద్రం నిర్వాహకుడు
200 బస్తాలు కుమ్మరిచ్చి 20 రోజులైంది..
పదేండ్ల నుంచి ఇదే కొనుగోలు కేంద్రంలో ఒడ్లు పోస్తున్న. మళ్ల ఇక్కడే కొంటరని 20 రోజుల కింద 200 బస్తాలు ఇక్కడ కుమ్మరిచ్చి నేర్పిన. ఒడ్లు తేటగ ఎండనయ్. ఇగ కొంటలేరు అగ కొంటలేరు. గతంలో ఇట్ల లేకుండె. వారం రోజులల్ల తూకం వేసేది లారీలల్ల పోయేది. చూస్తుండంగ డబ్బులు అకౌంట్ల పడేది. ఇప్పుడు కొనుగోలు కేంద్రం ప్రారంభమై పది రోజులైనా అతీలేదు గతీలేదు. సడీసప్పుడు చేస్తలేరు. అడుగుతె మాచేతుల లేదంటుండ్రు. సరైన సమాధానం చెప్పటోండ్లు లేరు. వానలు కొడితె ఇక్కడనే నీళ్లు నిలుస్తయ్. గింజ చేతికి రాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించాలి. రైతుల ఉసురుపోసుకోవద్దు
– లెక్కల ఇంద్రసేనారెడ్డి, రైతు, దేవరుప్పుల