తొర్రూరు, ఫిబ్రవరి 13 : అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రజల కోసం ఒక్క రూపా యి కూడా ఖర్చుచేయలేదని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని శ్రీనివాస గార్డెన్లో గురువారం జరిగిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారు ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడంతోనే రాహుల్‌గాంధీ పర్యటనను సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారన్నారు.
రేవంత్‌రెడ్డి ఒకసారి గెలిచిన స్థానంలో మళ్లీ గెలవలేరని, ఆయన బ్రోకర్‌గా పనిచేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. మంత్రి అయ్యే అవకాశం కూడా లేదని, కాంగ్రెస్ నాయకులను మభ్యపెట్టి సీఎం కుర్చీ ఎక్కాడని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసుకున్న రేవంత్‌రెడి ప్రజలను మభ్య పెట్టేందుకు మళ్లీ వాయి దా వేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించే చర్యలకు పాల్పడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో కుప్పకూలుతుందని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తుందని, ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలు గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రైతులకు కనీసం సాగునీరు కూడా అందించలేకపోయిందని, కరాల బ్రిడ్జి ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. తొర్రూరులో 100 పడకల ఆస్పత్రి పరిస్థితి ఏమైందని నిలదీశారు. గ్రామ సభల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నాయకులు పొనుగంటి సోమేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ ఏ ప్రదీప్‌రెడ్డి, కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, ఎన్నమనేని శ్రీనివాసరావు, మణిరాజు, తూర్పాటి రవి శంకర్, జైసింగ్, ఎసే అంకూస్, కాలునాయక్, రాయశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.