రాయపర్తి/ హసన్‌పర్తి, ఏప్రిల్ 25: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవానికి ప్రజలు ఉసిల్ల దండులా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అలాగే హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీని ప్రారంభించారు. బండి నడుపుతూ, డప్పు వాయిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, మేధావులు, తెలంగాణవాదులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మహిళలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. ఎల్కతుర్తి పేరు వింటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పాలకుల గుండెల్లో వణుకుపుడుతున్నద ని, సభను ఎలాగైనా అడ్డుకోవాలని బీజే పీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి 16 నెలల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ మార్పిడిని కోరుకుంటున్నారని అన్నారు. వందల మంది రైతులు స్వచ్ఛందంగా బండ్లు కట్టుకొని సభకు బయలుదేరుతున్నారని చెప్పారు. సభలో ఎడ్ల బండ్లే హైలైట్ కావాలని, కేసీఆర్ మెచ్చుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు ఎగురవేయడంతోపాటు అమరవీరులకు నివాళులర్పించి ఎల్కతుర్తి సభకు సకాలంలో చేరుకోవాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలివస్తారు. కేసీఆర్ మాట వినాలని, చూడాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారరు. రైతులు, మహిళలు, వృద్ధులు, యువకుల పక్షాన కేసీఆర్ గళం విప్పుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలి. కనీవినీ ఎరుగని రీతిలో ఈ బహిరంగ సభ విజయవంతం అవుతుంది.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఎల్కతుర్తి, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పో రాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ వేడుక రాజకీయ పార్టీది కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని అభివర్ణించారు. శుక్రవారం వారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. తొలుత వాహనాల పార్కింగ్ స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ కావాలనే బలమైన కాంక్ష ప్రజల్లో ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశం మొత్తం కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని ఎల్కతుర్తి వైపు చూస్తున్నదన్నారు.
పదేండ్లు కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి నెట్టిందన్నారు. ఇంత త్వరగా అభాసుపాలైన ఏకైక ప్రభు త్వం రేవంత్‌రెడ్డిది అని, మరో 25 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి లక్షలాదిగా ప్రజలు పలు వాహనాల్లో వస్తారని, పాదయాత్రగా వచ్చే వాళ్లు వేరే ఉన్నారన్నారు. భారీ ఎత్తున సభ విజయవంతం అవుతుందని గంగుల ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు పేర్యాల రవీందర్రావు తదితరులున్నారు.