పాలకుర్తి, ఏప్రిల్ 6: వల్మిడిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కల్యాణం ముగిసిన తర్వాత భక్తులు భోజనం చేసేందుకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలాయి. ఈ క్రమంలో భోజనం తింటున్న భక్తులతో పాటు వేచి ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టెంటు కింద ఉన్న చెన్నూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని మారబోయిన మనుశ్రీ మీద ఇనుప రాడ్ పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అలాగే వల్మిడికి చెందిన వాసూరి మారమ్మ, పెద్దవంగర మండలం గంట్లకుంటకు చెందిన పాయిలి సంధ్యతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
వీరికి వెంటనే ఆలయ ఆవరణలోని వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి పాలకుర్తిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా వైద్య శిబిరంలో కనీసం రోగుల కోసం బెడ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో గాయపడిన మారమ్మను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో దవాఖానకు తరలించాల్సి వచ్చింది. అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. ఈవోతో పాటు ఆలయ సిబ్బంది గాయపడిన వారిని పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు ఆరోపించారు.