హనుమకొండ రస్తా, జులై 29: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్‘ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనుందని విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు పి.నిర్మల తెలిపారు. మంగళవారం విభాగంలో జరిగిన బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశంలో ఈ అంశాన్ని 20 క్రెడిట్లతో నూతన పాఠ్యప్రణాళికలో భాగంగా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కొత్త సిలబస్లో గద్యభాగం, కవిత్వం, నటన, నాటకం, వ్యాకరణం, లెర్నింగ్, స్టడీ, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయని వివరించారు. అవసరమైన పాఠ్యపుస్తకాలు వారంరోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో విభాగాధిపతి ఆర్.మేఘనారావు, బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యులు ఎం.నవీన్, రాంభాస్కరరాజు, శ్రీనాథ్, హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీకి చెందిన ఎక్టర్నల్ మెంబెర్ ప్రొఫెసర్ శారద పాల్గొన్నారు.