తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు ఆడిపాడగా ఊరూవాడన సంబురం అంబరాన్నంటింది. తొలిరోజు బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైభవంగా జరుగగా చిన్న,పెద్దా, అంతా కలిసి ఉయ్యాల పాటలతో హోరెత్తించారు.
పట్టణాలు, జిల్లాకేంద్రాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో ప్రధానకూడళ్లు, ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఎప్పటిలాగే హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం ఆడబిడ్డలతో కోలాహలంగా మారింది. చాలాచోట్ల వర్షం కురిసినా వానలోనూ సంతోషంగా ఆడిపాడారు. అలాగే యువతులు, చిన్నారులు తాము అలంకరించిన బతుకమ్మలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆ తర్వాత వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు.
– నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 2