ఖిలావరంగల్, ఏప్రిల్ 21: రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సంఘి ఎలేందర్ అన్నారు. వరంగల్ తూర్పులో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ మిగులు భూములను దళితులకు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పోరేషన్ నిధుల గురించి అప్లయి చేసుకున్న వారి డాటా ఉండడం వలన కొత్తగా ఎంట్రీ కావడం లేదన్నారు. వెంటనే డాటా ఎంట్రీని సరిచేసి రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు తేదీలను పొడిగించాలన్నారు.
అలాగే ఎస్సీ ఇండస్ట్రీస్ 2018-22 ఉన్న సబ్సీడీలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాలనీ కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌళిక వసతులు కల్పించాలన్నారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే చట్ట పరంగా చర్యలు తీసుకొని స్టేషన్ బెయిల్ రాకుండా నివారించాలన్నారు.
మిగులు భూములను దళితులకు పంచి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా తూర్పు విలేకరులు తమకు గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు వారికి ఇచ్చి రిలే నిరాహారదీక్షలకు ముగింపు పలికే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను రవి, నాయకులు రాచర్ల రాజేందర్, బాణాల మహేష్, మంద నవీన్, ఠాగూర్ సునీత, వేల్పుగొండ నరసింహారావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.