నర్సింహులపేట, ఆగస్టు 25 : గ్రామాల్లో కరెంట్ పోయినా.. విద్యుత్ వైరు తెగినా పట్టించుకునే వారే లేరు. మరమ్మతు చేసేందుకు గ్రామ హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో కరెంటుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు, రైతులే మరమ్మతు చేసుకోవాల్సిన దుస్థితి గ్రామాల్లో నెలకొన్నది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న 100కేవీ ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవడంతో ఆదివారం కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విలేజ్ హెల్పర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. ట్రాన్స్ఫార్మర్కు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న బీల్యాతండాకు చెందిన రైతు లకావత్ రవి మిరప తోట నాటు వేసేందుకు నీళ్లు అవసరం పడడంతో చేసేది లేక తానే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫీజులు వేసుకొని తువాలతో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేశాడు.
ఏదైనా ప్రమాదం జరిగి రైతు కుటుంబం వీధిన పడితే కారణం ఎవరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం పైసలు ఇవ్వనిదే ఎవరూ రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలేజ్ హెల్పర్‌పై చర్యలు తీసుకోవాలని కొమ్ములవంచ, రూప్లాతండా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.