హనుమకొండ, జూలై 18: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర సిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనీషియేటివ్స్ శాఖ కార్యదర్శి హరిచందన దాసరి ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో సర్ పురోగతిపై జిల్లా వారీగా అధికారులతో సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్, పెండింగ్ దరఖాస్తుల పరిషారం తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాశ్వతంగా నివాసం మారిన, వలస వెళ్లిన, ఓటరు జాబితాలో మార్పులు చేయించుకోవాల్సిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బీఎల్వోల పనితీరును క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గిరిజన ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే రాజకీయ పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను సకాలంలో పరిషరించాలన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, స్నేహా శబరీష్, రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, ఎన్ రవి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియ విజయవంతంలో రాజకీయ పార్టీల సహకారం కీలకమని, అందుకు ప్రజా ప్రతినిథులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హరిచందన అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, అపోహలు తొలగించాలని సూచించారు. సమావేశంలో ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, నిశాంత్, ప్రవీణ్ కుమార్, కుసుమశ్యామ్, నిషాంత్, పుప్పాల రజనీకాంత్, రాజిరెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.