శాంతి, కరుణ, అహింసలకు ప్రతీకగా నిలిచి, ప్రపంచానికి ఆ దిశలో మార్గనిర్దేశనం చేస్తున్న పేరెన్నికగన్న బౌద్ధ గురువు దలైలామా. హిమాలయాల ఒడిలోని టిబెట్ దేశంలో పుట్టిన ఆయన దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా టిబెట్ బౌద్ధానికి అధిపతిగా కొనసాగుతున్నారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఆయన జీవితం ఏమీ ప్రశాంతంగా సాగలేదు. చైనా ఆక్రమణ ధోరణులను నిరసించారు. ఓపక్క తన ప్రజల్ని కాపాడుకుంటూ సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆంక్షల నడుమే ఎన్నో దేశాలు పర్యటించి తన భావాలను ప్రచారం చేశారు.
అయితే ఆయన జీవితం అంతకు మించిన ఆసక్తికర సంఘటనల సమాహారం. వాటన్నిటినీ పోగు చేసి ‘ఎటర్నల్ లైట్: ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ద ఫోర్టీన్త్ దలైలామా’గా తీసుకొచ్చారు రచయిత డా॥ అరవింద్ యాదవ్. దలైలామా బాల్యం నుంచి టిబెట్‌లోని రాజకీయ పరిణామాలు, భారత ప్రవాస జీవితం, జవహర్ లాల్ నెహ్రూ, జౌ ఎన్ లై లాంటి నాయకులతో జరిగిన కీలక సంభాషణలు, ప్రపంచ వేదికపై టిబెట్ సమస్యను అహింసా మార్గంలో వినిపించిన తీరు వరకు రచయిత పరిశోధనాత్మకంగా వివరించారు. సంఘటనలను కేవలం కాలక్రమంలో చెప్పకుండా, వాటి వెనుక ఉన్న రాజకీయ, సామాజిక, చారిత్రక నేపథ్యాన్ని కూడా విశ్లేషించడం ఈ పుస్తకం ప్రత్యేకతగా కనిపిస్తుంది.
ఆయన జీవితానికి సంబంధించిన గతంలో అసంపూర్ణంగా లేదా తప్పుగా ప్రచారమైన కథనాలను సరిచేయాలనే ప్రయత్నం చేస్తుంది ఇది. ముఖ్యంగా నెహ్రూ, చైనా నాయకత్వం, టిబెట్-చైనా సంబంధాల వంటి సున్నితమైన అంశాలను ఏకపక్షంగా కాకుండా చారిత్రక సందర్భంతో కలగలిపి వివరిస్తుంది. దలైలామా వ్యక్తిత్వాన్ని కొత్త దృష్టితో అర్థం చేసుకోవాలనుకునే వారికి, అలాగే టిబెట్ చరిత్రను కూడా తెలుసుకోవాలనుకునే పాఠకులకు మంచి పఠనాసక్తిని కలిగించే పుస్తకం ఇది. మొత్తంగా చెప్పాలంటే, దలైలామా 91వ పుట్టిన రోజు సందర్భంగా తీసుకువచ్చిన ఈ పుస్తకం ఆయన జీవితాన్ని దగ్గరి నుంచి చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్‌లోనూ చదవచ్చు.
రచయిత: డా. అరవింద్ యాదవ్
పేజీలు: 468, వెల: రూ.899
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, ఆన్లైన్ స్టోర్లు
-లక్ష్మీహరిత ఇంద్రగంటి
రచన : చిత్తలూరి సత్యనారాయణ
పేజీలు : 76; ధర : రూ.150
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 91338 32246