కాళేశ్వరం కూలింది అని పర్ పర్ అంటున్నవాళ్లు ఈ వ్యాసానికి పెట్టిన టైటిల్ ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం క్షణికానందం కలిగించవచ్చు. కానీ ఇది చదివితే వారి కండ్లు కొంతైనా తెరుచుకుంటాయి. ప్రాజెక్ట్ అంటే నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం వంటివి ఒకేచోట నిర్మితమై ఉన్నాయని ఊహించే వారికి, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఎక్కడ ఉన్నదని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఒక చిన్న చిట్కా పాటించవచ్చు.
‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎక్కడుందని గూగుల్ మ్యాప్‌ను అడిగితే లొకేషన్ చూపిస్తుంది. అదే గూగుల్‌ను అడిగితే నాగార్జునసాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఏపీలోని పల్నాడు జిల్లాల సరిహద్దులో నిర్మించారు’ అని చెప్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడున్నాయో స్పష్టంగా చూపిస్తుంది, చెప్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడుందని గూగుల్‌ను అడిగితే ముక్తేశ్వర ఆలయం ఉన్న కాళేశ్వరం అనే గ్రామాన్ని చూపిస్తుంది. అదేమిటి.. కాళేశ్వరం అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులాగా కాదా? లేదా విజయవాడ సమీపంలోని ప్రకాశం బరాజ్ లాంటిది కాదా? అనే అనుమానం వస్తుంది. అది అనుమానం ఎంతమాత్రం కాదు, అంతకంటే ముఖ్యంగా, అబద్ధం అసలే కాదు. ఎందుకంటే కాళేశ్వరం ఒక మల్టీ-సైటెడ్ ప్రాజెక్టు.
అంటే.. మరి కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం ఏమిటి? అనే పశ్న వస్తుంది. దీనిని తెలుసుకోవాలంటే, మేడిగడ్డ బరాజ్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం చర్చ జరుగుతున్నది కాళేశ్వరం ఆలయానికి సమీపంలో గోదావరి మీద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ గురించే. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ అంతర్భాగం. ఇది గోదావరి నదిపై 1.6 కి.మీ పొడవుతో నిర్మితమైంది. 85 గేట్లు, 8 బ్లాక్‌లతో కూడినది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చర్చ అంతా ఈ బరాజ్‌లోని ఒక బ్లాకులోని రెండు పిల్లర్ల దగ్గర ఏర్పడిన సమస్య గురించి. అంతేగానీ మొత్తం మేడిగడ్డ బరాజ్ మీద కాదు. అంతకన్నా ముఖ్యంగా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద కాదు. కానీ ప్రచారం మాత్రం మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని. ఇంతకన్నా విషప్రచారం ఇంకొకటి ఉండదు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆధునిక ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. ఈ ప్రాజెక్టు భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఉండటం గర్వకారణం. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో నిర్మితమైన ప్రాజెక్టు. కాళేశ్వరం కుంగింది అని చెప్పేవారు వాస్తవానికి మేడిగడ్డలోని 85 గేట్లలో కేవలం మూడు గేట్లలోనే సమస్యను సూచిస్తున్నారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒక ఊరిలో కష్టపడి పనిచేసే రైతు ఉన్నాడు. అతను తన భూమిని సాగుచేయడానికి ఎన్నో ప్రయత్నాల తర్వాత నాలుగు బోరు బావులు తవ్వి, వాటి ద్వారా పుష్కలంగా నీరు అందిస్తున్నాడని అనుకుందాం. కానీ వివిధ కారణాల వల్ల ఆ నాలుగు బోరుబావుల్లో ఒకటి కుంగిపోయింది. ఆ బోరుబావి కుంగిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు-నేల బలహీనంగా ఉండట లేదా ఎవరో ఈర్ష్యతో కావాలనే పాడుచేయడం వంటివి. ఆ బోరుబావి కొంతకాలం ఉపయోగించలేనిదిగా మారుతుంది. కానీ ఆ నష్టం ఆ ఒక్క బోరుబావికే పరిమితం. మిగతా మూడు బోరుబావులు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, అన్ని బోరుబావులు పనికిరావని చెప్పడం అర్థం లేనిది అవుతుంది. అంతకంటే ముఖ్యంగా, అలాంటి మాటలు చెప్పేవారిని దుష్ప్రచారం చేస్తున్న వారిగా అనుమానించాల్సి వస్తుంది. కాళేశ్వరం విషయంలో కూడా ఇదే జరుగుతున్నది.
ప్రపంచ బ్యాంక్ తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఇటీవలే గుర్తించింది. తలసరి ఆదాయం ఆధారంగా, దేశంలో అప్పర్ మిడిల్ ఇన్కమ్ వర్గంలోకి వచ్చిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా పేర్కొన్నది. దీనిలో కాళేశ్వరం పాత్ర ప్రముఖంగా ఉన్నది. కాళేశ్వర ఆలయం సమైక్య రాష్ట్రంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్ వంటి నిర్మాణాలు ఈ ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల, కాళేశ్వరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత యాదాద్రి, వేములవాడ, జోగులాంబ ఆలయాలు ఎంత వేగంగా భక్తుల మనసుల్లో స్థానం సంపాదించాయో, కాళేశ్వరం ఆలయానికి కూడా ఆధ్యాత్మిక గుర్తింపు లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక బరాజ్ అనడం తప్పు. దాని గేట్లు కుంగినాయనే ఇమేజ్ సామాన్య ప్రజల మనసులో ముద్రించేలా చేసిన ప్రయత్నం రాజకీయ వికృత క్రీడలో భాగంగా చేసిన కుటిల ప్రయత్నమని చెప్పవచ్చు. అందువల్ల, బురద రాజకీయాలు చేసే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ప్రోత్సహించి, అబద్ధాలను వ్యాప్తి చేసే అనుచరగణం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలంగాణ రైతులు, ప్రజలు ఆలోచించాల్సిన విషయం.
– సిరారె