ఖిలావరంగల్, మార్చి 26 : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం ఎంజీఎం దవాఖానలో జరిగింది. వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన కందగట్ల సుదర్శన్ (73) వయోభారం వల్ల మానసిక, శారీరక సమస్యలు తలెత్తడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ఈ నెల 25న కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ మధ్యునున్న 377/20-22 మైలు రాయి వద్ద రైలు పట్టాలపైకి చేరుకున్నాడు.
రైలు నెంబరు 28288 లోకో గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కటుంబ సభ్యులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.