హనుమకొండ చౌరస్తా, మే 20 : పల్లె మొదలు పట్టణం దాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన సీఎం కప్ పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హనుమకొండ జేఎన్ఎస్లో మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో జిల్లా నుంచి సుమారు 1700 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. పోటీల విజయవంతానికి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కూడిన పలు నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకించి భోజనం ఏర్పాట్లు, శానిటేషన్, మెడికల్, రిసెప్షన్, ప్రారంభ, ము గింపు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు క్రీడల నిర్వహణ, ఎంపికల కమిటీలో సంబంధిత క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులను భాగస్వాములను చేసినట్లు చెప్పారు. వేసవి నేపథ్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులు సకాలంలో హాజరయ్యేలా ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు ప్రత్యేక దుస్తులు అందించనున్నట్లు తెలిపారు.
ప్రారంభించనున్న మంత్రులు
ఈ నెల 22న ఉదయం జరిగే సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్ హాజరుకానున్నట్లు తెలిపారు.
సైన్ బోర్డ్‌ల ఏర్పాటు..
వివిధ మండలాల నుంచి వచ్చే క్రీడాకారులు క్రీడా మైదానాన్ని సులువుగా గుర్తించేందుకు వీలుగా ప్రధాన ద్వారం వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు డీవైఎస్వో అశోక్‌కుమార్ చెప్పారు. రిసెప్షన్ కమిటీలో తొలుత ఆయా మండలాల కోచ్, మేనేజర్లు ఎంట్రీ ఫారాలను ఆధార్ కార్డు జిరాక్స్‌లు జతచేసి సమర్పించాలని, వివరాలు సరిగా ఉంటేనే ఆడేందుకు అనుమతిస్తామన్నారు. ప్రతి రోజూ క్రీడలు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతాయని తెలిపారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
జిల్లాస్థాయి సీఎం కప్ నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారుల బృందం శనివారం పరిశీలించింది. కలెక్టర్ సూచన మేరకు వివిధ కమిటీల బాధ్యులు హనుమకొండలోని జేఎన్ఎస్లో ఆయా క్రీడా మైదానాలు, భోజన నిర్వహణ ఏర్పాట్లు, మొబైల్ టాయిలెట్లు, షామియానాల ఏర్పాటును పరిశీలించారు. అనంతరం నిర్వహణ ఎంపిక కమిటీల బాధ్యులతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం క్రీడలు పూర్తిచేయాలన్నారు. అనంతరం కబడ్డీ పురుషులు, మహిళల జట్ల డ్రాలు తీశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి అశోక్‌కుమార్, డీసీవో, డీఎండబ్ల్యూ హనుమకొండ శ్రీనివాస్, మెప్మా పీడీ భద్రునాయక్, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ జోన, ఆర్ఐలు, ఏఈలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సారంగపాణి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.