కమలాపూర్, జూలై 18 : వానకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. దీంతో బావుల కింద వరి సాగుచేసిన రైతులు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. బావుల్లో నీరు అడుగంటి పోతుండడంతో క్రేన్ల సాయంతో పూడిక తీయడంతో పాటు మరింత లోతు తవ్విస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన గోనెల రమేశ్ రెండున్నర ఎకరాల్లో వరిసాగు చేసేందుకు పొలంలో వడ్లు చల్లాడు.
మొ లకెత్తిన వరి మొలకెత్తి వారం రోజులవుతుండగా, సాగు నీరందక పొలం నెర్రెలు బారింది. బావిలో నీరుతో పది గుంటలు కూడా తడవకపోవడంతో ఆం దోళన చెందుతున్నాడు. అలాగే ఉప్పల్లో రైతులు బావులు తోడిస్తున్నారు. సాగునీటి కోసం తాము తం డ్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బా వుల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపో తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు నీటి కష్టాలు లేకుండే. కాంగ్రెస్తో పాటే కరువొచ్చింది. నెలన్నర దాటినా వర్షం పడుతలేదు. బాయిలో నీళ్లు ఎళ్లడం లేదు. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నయి. రూ. 30 వేలు ఖర్చుపెట్టి బావిలో పూడిక తీయించిన. ప్రభుత్వం ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుతో రిజర్వాయర్లు నింపి రైతులను ఆదుకోవాలే.
– ఎర్రబెల్లి లింగారావు, రైతు, ఉప్పల్