అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై హంగామాగా ప్రకటన చేసింది గానీ ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేయక పోవడం, అదనంగా నిధులు కేటాయించకపోవడంతో ప్రారంభించిన తెల్లారే చివరి రోజయ్యింది. కేసీ ఆర్ ఇచ్చే దానికన్నా రెట్టింపు ఇస్తాం. ఇంకా ఏదో చేస్తామంటూ హామీలిచ్చి కాంగ్రెస్ సర్కారు పిల్లలకు ఒక్క రోజు ఎగ్ బిర్యానీ పెట్టి చేతులెత్తేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. – జనగామ రూరల్, అక్టోబర్ 27
‘అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం అందిస్తాం. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఎగ్ బిర్యాని పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘అమ్మమాట.. అంగన్వాడీ బాట’ పేరిట జిల్లావ్యాప్తంగా ఈఏడాది జూలై నెలలో అధికారులు, పాలకులు పలు చోట్ల ఎగ్ బిర్యాని వడ్డించి ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికి నిధులు కేటాయించకపోవడంతో నిలిచిపోయింది. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చి ఊహాలోకాల్లోకి తీసుకుపోయింద ని, అధికారంలోకి వచ్చిన అనంతరం ఏ పథకం సక్రమంగా అందించడం లేదని ప్రజలు వాపోతున్నా రు. కొత్తవి ఏమీ ఇవ్వకపోయినా కేసీఆర్ పథకాలను సైతం పూర్తి స్థాయిలో కొనసాగించడం లేదని మండిపడుతున్నారు.
అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలతో పాటు గర్భిణులకు మరింత బలవర్దకమైన ఆహారం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్ బిర్యాని పథకం ప్రవేశపెట్టింది. జనగామ జిల్లావ్యా ప్తంగా 695 అంగన్వాడీ సెంటర్లలో 8562 మంది చిన్నారులతో పాటు గర్భిణులు 2621మంది, బాలింతలు 2174 మంది ఉన్నారు. వీరందరికి గత జూన్లో ఎగ్ బిర్యాని ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి ఏ సెంటర్లోనూ ఎగ్ బిర్యాని వాసన రావడం లేదు. బిర్యానికి కావాల్సిన మసాలాలు, నూనె తదితర మెటీరియల్ కోసం ఎలాంటి నిధులు సర్కారు కేటాయించలేదు.
అందుకే దాన్ని వండడం లేదని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. ఈవిషయమై డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్ను ఫోన్లో సంప్రదించగా తర్వాత చెప్తామని దాటవేశారు. ప్రభుత్వం ఎగ్ బిర్యాని వండాలని ఆదేశాలిచ్చిందని, దానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలు విడుదల చేయలేదని, అలాగే నిధులు కేటాయించకపోవడంతోనే నిలిచిపోయిందని పేర్కొన్నారు. కొన్ని అంగన్వాడీ సెంటర్లలో అసలు ఎగ్ బిర్యాని ప్రారంభించ లేదని తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు కేటాయించి అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యాని వడ్డించి పిల్లలకు పోషకాహారం అందించాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.