సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మిల్స్ మాజీ ఉద్యోగులకు మడిపల్లి, అనంతసాగర్ గ్రామాల వద్ద కుడా డెవలప్ చేసిన స్థలంలో ప్లాట్లను కేటాయించాలని పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో ఈ పని పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మౌలిక వసతులూ కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇక్కడే పోలీసు శాఖ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్ నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. త్వరలోనే ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
– వరంగల్, మార్చి 9(నమస్తేతెలంగాణ)
వరంగల్, మార్చి 9(నమస్తేతెలంగాణ) : జిల్లాల పునర్విభజనతో వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఇక్కడి నర్సంపేట రోడ్డులోని లక్ష్మీపురం, ఖిలా వరంగల్ రెవెన్యూ శివారులోని ఆజంజాహి మిల్స్ స్థలంలో నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మిల్స్ భూముల్లో సమీకృత కలెక్టరేట్ నిర్మిస్తే జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనకు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సుముఖత వెలిబుచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ను కలిసి తమ ప్రతిపాదనను వివరించారు. సీఎం ఆమోదం తెలుపడంతో మిల్స్ భూముల్లో నుంచి 6.16 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే చేనేత, జౌళి శాఖ కార్యాలయం, చేనేత కార్యకలాపాలు, శిక్షణ కేంద్రం ఏర్పాటు, గోడౌన్ సహా సొంతంగా టీఎస్సీవో షోరూం నిర్మాణం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యం కల్పించడానికి హ్యాం డ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, అపెరల్ ఎక్స్‌పోర్టు పార్క్స్ కమిషనర్ లేఖ మేరకు ప్రభుత్వం 2.32 ఎకరాలను కేటాయించింది.
అనంతరం కలెక్టర్ నివేదిక ప్రకారం ఎస్ఎల్పీ పరిధిలోకి రాని ఆజంజాహి మిల్స్ భూముల్లో నుంచి 9.08 ఎకరాలను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. 6.16 స్థలంలో కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులు చేపట్టేందుకు కసరత్తు కూడా మొదలైంది. దీనిపై మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడారు. డిజైన్ తయారీపై సూచనలు చేశారు. అధికారులు రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో ఆజంజాహి మిల్స్ మాజీ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు కొద్దిరోజుల క్రితం తుది తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది.
మా సిటీ వద్ద ప్లాట్లు..
ఆజంజాహి మిల్స్ మాజీ ఉద్యోగులకు మడిపల్లి, అనంతసాగర్ గ్రామాల వద్ద కుడా అభివృద్ధి చేసిన స్థలంలో ప్లాట్లను కేటాయించాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. 318 మంది మాజీ ఉద్యోగులకు మూడు నెలల వ్యవధిలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. దీంతో మా సిటీలో మిల్స్ మాజీ ఉద్యోగులకు ప్లాట్లను కేటాయించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మిల్స్ భూములు దాదాపు 28 ఎకరాలకుపైగా రెవెన్యూశాఖ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పరేడ్ గ్రౌండ్ కూడా ఇక్కడే..
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ఈ మేరకు సరిపడా స్థలం ఉంటే సమీకృత కలెక్టరేట్‌తో పాటు పోలీసు శాఖ కార్యాలయాలు, పరేడ్‌గ్రౌండ్, హెలీప్యాడ్ వంటివి ఒకేచోట నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకుపోతుంది. ఆజంజాహి మిల్స్ భూముల్లో సుమారు 28 ఎకరాలు రెవెన్యూ శాఖ ఆధీనంలోకి రానున్నది. ఇందులో చేనేత, జౌళిశాఖకు ప్రతిపాదిత 2.32 ఎకరాలు పోను మిగతా 25 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు కలెక్టర్ క్వార్టర్, పోలీసు శాఖ జిల్లా కార్యాలయం, పరేడ్‌గ్రౌండ్, హెలీప్యాడ్ వంటివి నిర్మించే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. బుధవారం పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌తో ఆజంజాహి మిల్స్ భూములను రెవెన్యూశాఖకు అప్పగించే అంశాన్ని కలెక్టర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రస్తుతం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆధీనంలో ఉన్న ఈ భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నట్లు సమాచారం. కేటీఆర్ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నందున సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.