హనుమకొండ చౌరస్తా, మే 30: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ(ఆదివారం)న 2025-26 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, టీజీ ఎడ్‌సెట్-2025 కన్వీనర్ ఆచార్య బైరు వెంకట్రాంరెడ్డి తెలిపారు. టీజీ ఎడ్‌సెట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు మొత్తం 38,758 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నట్లు, వీరిలో పురుషులు 7218, మహిళలు 31,539, 1 ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు, మొత్తం 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రెండు సెషన్లలో మొదటి సెషన్ ఉదయం 10 నుంచి 12 మధ్య, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సెంటర్లో ఉదయం సెషన్ అభ్యర్థులు 8 గంటల, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు 12 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, ఉదయం 9.30, మధ్యాహ్నం 1.30 అనంతరం అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించటం జరగదని, ఒక నిమిషం నిబంధన అమలులో ఉంటుందని, హాల్‌టికెట్‌తో పాటు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ ఐడెంటికార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపుకార్డు, బ్లూ లేదా బ్లాక్ పెన్ తమవెంట కలిగి ఉండాలన్నారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌తో పాటు వెనుక వైపు పరీక్షాకేంద్రం లొకేషన్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని, అవసరమైతే ముందురోజే పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవాలని సూచించారు.