విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం ఈ మార్కెట్‌కు ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరి పనితనాన్ని మెచ్చుకుని రూ.6,20,000 విడుదల చేసింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి గురువారం కార్యదర్శి, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది మొత్తం 38 మందికి నగదు పోత్సాహకం అందించనున్నారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది సంబురం వ్యక్తం చేస్తున్నారు.
కేసముద్రం, ఆగస్టు 24 : ఈ-నామ్ విజయవంతంగా అమలు చేసి ఎక్సలెన్సీ అవార్డు రావడానికి కృషి చేసిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి నగదు ప్రోత్సాహకం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. మార్కెట్ కార్యదర్శి, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది మొత్తం 38 మందికి రూ.6,20,000 ప్రభుత్వం నుంచి విడుదలైనట్లు చెప్పారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఉద్యోగులకు గుర్తింపు..
పంట ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ధర ఉండాలనే ఉద్దేశంతో 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ-నామ్ విధానం అమలుపై సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. రైతులు తమ సరుకులను మార్కెట్‌కు తీసుకు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు మార్కెట్ అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేస్తూ దీన్ని రూపొందించారు. మార్కెట్ సెక్యురిటీ గార్డులు రైతు పేరు, గ్రామం, సరుకు పేరు, బస్తాల వివరాలతో కూడిన చీటిని అందిస్తారు. దీని ఆధారంగా కంప్యూటర్ ఆపరేటర్లు లాట్ నంబర్ ఇస్తారు. వ్యాపారులు నాణ్యతను పరిశీలించి ఆన్లైన్ టెండర్లో ధరలు నిర్ణయిస్తారు. టెండర్లో ఎక్కువ ధర కేటాయించిన వ్యాపారికి సరుకు కేటాయిస్తారు. కాంటాలు పూర్తయిన తర్వాత తూకం వివరాలు, ధర ఆధారంగా కంప్యూటర్ ఆపరేటర్లు రైతులకు తక్ పట్టీ అందిస్తారు. వ్యాపారులు డబ్బులు చెల్లిస్తారు. రైతులకు సమస్యలు ఎదురైతే మార్కెట్ అధికారులు పరిష్కరిస్తారు.
సౌకర్యాల కల్పన..
ఈ-నామ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండ గా, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభు త్వం సమకూర్చింది. రైతులు, కార్మికులు, వ్యాపారులకు మౌలిక వసతుల కల్పనలోనూ కేసముద్రం మా ర్కెట్ ముందజలో ఉంది. తాగునీటి కోసం రూ.12 లక్షలతో నీటి శుద్ధీకరణ యంత్రాలు, రూ.80 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించారు. రూ.3.60కోట్లతో కవర్ షెడ్లు, రూ.80 లక్షలతో నూతన భవనం, రూ.1.50 కోట్లతో గోదాము నిర్మించారు. ఇందులో సరుకు నిల్వ చేసే రైతులకు పంట విలువలో 70 శాతం మేరకు వడ్డీలేకుండా రుణం అందిస్తున్నారు. అలాగే, మార్కెట్లో రైతులకు రూ.5లకే భోజనం అందిస్తున్నారు. ఉచితం గా వైద్య సేవలు అందించి మందులు ఇస్తున్నారు.
అంకితభావంతో పని చేస్తే గుర్తింపు..
– మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు
అంకితాభావంతో పని చేస్తే ప్రజల్లో గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. జాతీయ స్థాయిలో కేసముద్రం మార్కెట్‌కు ఎక్సలెన్సీ అవార్డు రావడం, అందుకు కృషి చేసిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకం అందించడం సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేయడాన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి.
సంతోషంగా ఉంది..
– పొదిల మధు , డాటా ఎంట్రీ ఆపరేటర్
జాతీయ స్థాయిలో ఈ-నామ్ ఎక్సలెన్నీ అవార్డు కేసముద్రం మార్కెట్‌కు రావడం, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ఇవ్వడం సంతోషంగా ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభించింది. నగదు ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.