హనుమకొండ, నవంబర్ 4: పెండింగ్‌లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు. కేయూ క్యాంపస్‌లోని వీఆర్ఎస్ హాస్టల్ ఎదుట స్కాలర్స్నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ఇప్పటివరకు విడుదల చేయకుండా మాటలతో పబ్బం గడుపుతుందని, ఫీజులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.
గతంలో ప్రైవేటు యజమాన్యాలు ఫీజులు విడుదల చేయాలని ఆందోళన చేసిన నేపథ్యంలో రెండు విడతలుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, విడుదల చేయకుండా మాట మార్చిందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెండింగ్‌లో ఉన్న ఫీజులను విడుదల చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ స్కాలర్స్ నేతలు కందికొండ తిరుపతి, కేతపాక ప్రసాద్, గుండేటి సుమన్, ఏ.సూర్యకిరణ్ పాల్గొన్నారు.