ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకొని నిశ్చింతగా ఉండాల్సిన రైతుకు.. అధికారులు, నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం శాపంలా మారుతున్నది. రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించడంలో ఆలస్యం చేస్తుండడంతో వడ్లకు మొలకలు వచ్చి అన్నదాతను ఆగం చేస్తున్నది.
కురవి/గణపురం, మే 23: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతు బదావత్ యుగేంధర్కు చెందిన ధాన్యం కాంటా పెట్టారు. టార్పాలిన్లు కప్పి నిల్వ ఉంచారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బస్తాల నుంచి వడ్లు మొలకలు వస్తుండడం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. సకాలంలో లారీలు రాక, కాంటా అయిన బస్తాలు మిల్లులకు చేరక వర్షానికి తడిసిపోయాయి. మొలకెత్తుతున్న వడ్లను తీసి మళ్లీ ఆరబెట్టి బస్తాల్లో నింపాల్సిన దుస్థితి దాపురించింది.
ఇప్పటివరకు కేంద్రంలో 1,282 బస్తాల ధాన్యం కాంటా పెట్టామని మరో 8వేల బస్తాలకు సరిపడా ధాన్యం రాశులున్నాయని నిర్వాహకుడు జితేందర్ తెలిపారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఓ రైతు 15 రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే ఐదు రోజుల క్రితం కాంటాలు పెట్టారు. కానీ, తరలింపులో జాప్యం, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వడ్లన్నీ తడిసి బస్తాల్లోనే మొలకెత్తింది. ప్రభుత్వం, కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో నిండా మునుగుతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు.