ఉప్పునుంతల/శంకరపట్నం/పెన్‌పహాడ్/ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 14: కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు. యూరియా బుకింగ్ యాప్ వద్దని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ రహదారిపై ధర్నాకు దిగారు. ఏవో వెంకటేశ్‌తో వాగ్వాదానికి దిగారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని మన గ్రోమోర్‌కు 285 బస్తాలు, ఆగ్రో రైతు కేంద్రానికి 400 బస్తాల యూరియా రాగా.. రైతులు తెల్లవారుజామునే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. యూరియా బుకింగ్ కోసం సెల్ పట్టుకొని యాప్ ఓపెన్ చేయగానే.. క్షణాల్లో స్టాక్ జీరో కనిపించింది. దీంతో రైతులు ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. కేంద్రాల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ పీఏసీఎస్ ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. చిన్న ఫోన్లు ఉన్న , ఆన్లైన్ తెలియని రైతులు యూరియా అందక పంట పొలాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
సూర్యాపేట జిల్లా అనంతారం సింగిల్ విండో కార్యాలయానికి శుక్రవారం 444 బస్తాలు యూరియా రాగా గోదాంలో నిల్వచేశారు. శని,ఆదివారాలు సెలవులు కావడంతో అధికారులు యూరియా వచ్చినా కంప్యూటర్లో ఎలాంటి స్టాక్ అప్లోడ్ చేయలేదు. కానీ గుర్తుతెలియని వ్యక్తి శనివారం ఉదయం 6.25 గంటల ప్రాంతంలో పీఏసీఎస్ పరిధిలో ఉన్న సిస్టమ్ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసి 444 బస్తాల యూరియాను యాప్‌లో అప్లోడ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
అధికారులకు తెలియకుండా పాస్వర్డ్ ఇతరులకు ఎలా తెలుస్తుందని ఏవో అనిల్నాయక్ను రైతులు నిలదీశారు. యూరియాను సొసైటీకి చేర్చడం వరకే తమ బాధ్యత అని, కంప్యూటర్లో లాగిన్ చేయడం తమ పని కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై నారాయణగూడెం విండో వారు వెబ్ సైట్ హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూరియా బుక్ చేసుకున్న రైతులు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.