పాపన్నపేట, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గామాత జాతర ఆదివారం (నేటి) నుంచి ప్రారంభం కానున్నది. మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఏడుపాయల్లో పెద్దఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ జాతర జానపదుల సంస్కృతికి అద్దం పడుతుంది. తెలంగాణతో పాటు కర్ణాటక,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు ఏటా సుమారు 10 లక్షల వరకు వస్తారు. అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, రాజగోపురం, పరిసరాలు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. లేజర్ లైట్లు ఏర్పాటు చేశారు. నాగ్సాన్పల్లి వైపు ఉన్న ఏడుపాయల కమాన్, పోతంశెట్టిపల్లి వైపు రెండో బ్రిడ్జి వైపు ఏర్పాటు చేసిన విద్యుత్ స్వాగత తోరణాలు, దేవతామూర్తుల కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాజగోపురం నుంచి ప్రధాన ఆలయం వరకు భారీ క్యూలైన్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ ఉంది. ఆలయ పరిసరాల్లో మంజీరా నది తీరంలో భక్తులు స్నానాలు చేయడానికి షవర్లు, దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యార్ధం నల్లాలు, తాత్కాలిక టాయిలెట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. జాతర జరిగే మూడు రోజులపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను సిద్ధం చేశారు. భక్తుల కోసం పలుచోట్ల తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశారు. నాగ్సాన్పల్లి వైపు వచ్చే ప్రైవేటు వాహనాలను నిలిపేందుకు చర్మెలకుంట వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. కొల్చారం, పోతన్ శెట్టిపల్లి వై జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం రెండో, మూడో బ్రిడ్జిల వైపు పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు.
ఏడుపాయల ఈవో వీరేశం,ఆలయ సిబ్బంది సేవలందించేందుకు సిద్ధం గా ఉన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. నలుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80మంది ఎస్సైలు, 45 మంది ఏఎస్సైలు, 85 మంది హెడ్ కానీస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు,14 మంది మహిళా హోంగార్డులతో పాటు స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మొత్తం 829 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
జాతర జరుగుతుంది ఇలా..
ఏడుపాయల జాతర మొదటి రోజు ఫిబ్రవరి 15న ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకొని ఉపవాస దీక్షలతో ప్రారంభమవుతుంది. భక్తులు మంజీరా నదిలో ఫుణ్యస్నానాలు చేసి ఉపవాస దీక్షలు చేపడుతారు.రాత్రి అమ్మవారి సన్నిధిలో జాగారం చేస్తారు. మరునాడు అమ్మవారిని దర్శించుకొని ఉపవాస దీక్షలు విరమిస్తారు. జాతరలో ముఖ్యమైన ఘట్టమైన సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం కొనసాగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాదీశుల బండి ముందు వెళ్లగా, మరో 100 బండ్లు దానిని అనుసరిస్తాయి. బండ్ల ఊరేగింపునకు లక్షలాది మంది భక్తులు తిలకిస్తారు. జాతరలో చివరి రోజైన మంగళవారం రాత్రి రథోత్సవం కొనసాగుతుంది. 18 మంది పనిబాటల వాళ్లు రథం ముందు రతి పోసి ముగ్గులు వేసి రథాన్ని తాగుతారు. రథోత్సవానికి భారీగా భక్తులు తిలకిస్తారు. ఈ అంతిమ ఘట్టంతో జాతర ముగుస్తుంది.