కురవి, ఆగస్టు 21 : ప్రజా ప్రభుత్వం అని పేరుకు చెప్పుకొని డబ్బులు దండుకోవడానికి తప్ప..కాంగ్రెస్ నాయకులకు రైతుల గోస పట్టదు, ప్రణాళిక ఉండదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో ఇస్తున్న యూరియా బస్తాల కోసం సంత ఆవరణలో వేచివున్న రైతులతో మాట్లాడారు. సొసైటీకి 444 బస్తాలు వస్తే 2000 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారని. ఎవరికి బస్తాలు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వ్యవసాయానికి మంచి అదును ఉన్న పని రోజులని రైతులు రోజు మొత్తం నిలబడి యూరియా రాకపోతే వారి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అవగాహన లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక అవగాహన లేకపోవడం వల్లనే నేడు రైతులు ఈ దుస్థితికి చేరుకున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్కనాడు అయినా రైతు ఇబ్బంది పడ్డాడా అని ప్రశ్నించారు. కురవి మండలంలో రైతులు ఎంత వ్యవసాయం చేస్తున్నారు అధికారుల వద్ద లెక్క తెలియదా..ఉన్న లెక్కలను పట్టించుకోరా అన్నారు.
తాను గతంలో ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రైతులకు యూరియా అందించానన్నారు. కానీ ఇప్పుడు అధికార పక్షంలో అత్యున్నతమైన స్థానంలో ఉండి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. రైతుల తరపున, ఈ నియోజకవర్గ బడుగు బలహీన గిరిజన రైతుల పక్షాన శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిసి పరిస్థితిని వివరించి రాబోయే అలాట్మెంట్ లోనైనా మరికొంత యూరియాను కురవికి పెంచేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామ సైదులు, గుగులోత్ రాంలాల్ నాయక్,
రాము నాయక్, అయూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.