సీజన్‌కు ముందే మోస్తరు వర్షాలతో మురిపించిన వరుణుడు తీరా ముఖం చాటేయడంతో రైతన్న ఆందోళనలో పడ్డాడు. ఈసారి అదునుకు ముందే వర్షాలు పడుతాయనే ఆశతో నార్లు పోసి, దుక్కులు దున్ని, పత్తి గింజలు వేసుకున్నాడు. తీరా చినుకు జాడ కరువై పంటకు తడి లేక ఎండిపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. విత్తుకున్న గింజలకు నీటి తడి కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటికే యాసంగి సీజన్లో వర్షాభావ పరిస్థితులు, కరువుతో 30 శాతం పంట దిగుబడి కోల్పోయిన రైతులు ఈ వానకాలంపైనే పూర్తి నమ్మకం పెట్టుకోగా సీజన్ ఆరంభంలోనే వర్షాలు దోబూచులాడుతుండడంతో పంటల సాగు ఎలా గని ఆవేదన చెందుతున్నారు.
– జనగామ, జూన్ 10(నమస్తే తెలంగాణ)
దాదాపు నెల రోజుల నుంచి సాగు పనులు మొదలయ్యాయి. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు నారు సిద్ధం చేసుకున్నారు. జనగామ జిల్లాలో వానకాలంలో వరి 2.15 లక్షలు, పత్తి 1.25 లక్షలు.. అన్ని పంటలు కలిపి 3.40 లక్షల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నర్మెట, పాలకుర్తి, లింగాలఘనపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తితో పాటు జనగామ ప్రాంతంలోని పలు గ్రామాల్లో సుమారు 40వేల ఎకరాలకు పైగా పత్తి గింజలు విత్తుకున్నారు.
గత నెల 24వ తేదీ వరకు అడపాదడపా వర్షాలు కురవడంతో 10 నుంచి 15వేల ఎకరాల్లో వరి నాట్లు కూడా వేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు 10 మీటర్ల లోతుకు పడిపోగా, 80శాతం మేర బోర్లు వట్టిపోయాయి. బోరు బావుల ద్వారా సాగు నీరు అందించలేని పరిస్థితుల్లో రైతులు ఆధారపడ్డారు. గత నెల 25 నుంచి వాన జాడ లేకపోవడంతో నారు మళ్లు, నాట్లు వేసిన పొలాలు, పత్తి విత్తనాలు ఎండిపోయి పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంది. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె మొదలైనప్పటికీ వరుణుడు ముఖం చాటేయడంతో సీజన్ పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు అప్పులు చేసి బోర్లను మళ్లీ వేయిస్తుండగా, మరికొందరు కొత్తగా వేయిస్తున్నారు.