చిట్యాల/పెద్దవరంగర, మార్చి 22: జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం కైలాపూర్ శివారు శాంతినగర్లో, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పడమటితండాలో తాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై శనివారం ‘నమస్తే తెలంగాణలో ‘దాహం దాహం -శాంతినగర్లో తాగునీటి గోస’, పడమటితండాలో రానీ భగీరథ నీళ్లు అనే శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యా యి. దీంతో అధికారులు స్పందించారు. శాంతినగర్లో గ్రామీణ నీటి పారుదలశాఖ, మిషన్ భగీరథ డీఈఈ శ్వేత, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీవో రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గీత అధికారులు పర్యటించారు.
తాగునీరు చేరుకోలేని ఇండ్లలోకి వెళ్లి పరిశీలించారు. గ్రామంలోని రెండు వాడల్లో ఒకటి ఎత్తులో, మరొకటి వంపులో ఉండడం వల్ల ట్యాంకు నీరు పల్లపు ప్రాంతంలో వాడకే పూర్తిస్థాయిలో వెళ్తున్నాయన్నారు. సమస్యను పరిషరించి ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు చేరేలా చూస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో వాడకంలో లేని చేతిపంపులను పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే అధికారులు పడమటితండాలో పర్యటించి, గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో శాంతినగర్వాసులు, పడమటి తండా వాసులు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.