మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అంతటా ఘనంగా జరుపుకొంటుంటే ఇక్కడ మాత్రం ఇలా చెలిమలు, ఒర్రెల్లో నీళ్లు బిందెల్లో తోడుకుంటూ కడు దయనీయంగా బతుకీడుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి జీవనోపాధి కోసం ములుగు జిల్లా మంగపేట అడవులకు వలసొచ్చిన గొత్తికోయలు సమస్యలతో సతమతమవుతున్నారు.
– మంగపేట, ఆగస్టు 9
మంగపేట మండల కేంద్రం సమీపంలోని దట్టమైన అడవిలోకి పాతికేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని 80 గొత్తికోయ కుటుంబాలు వలసొచ్చాయి. శాంతినగర్ పేర ఏర్పడి న గూడెంలో కనీస సౌకర్యాలు లేవు. గూడెంలో చేతి పంపు ఉన్నా చిలుము, బురద నీళ్లు వస్తుండడంతో కిలో మీటరు దూరంలోని అడవిలో పారె ఒర్రె నుంచి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నారు. మరోవైపు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతూ దోమలతో సహవాసం చేస్తున్నారు.
దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. గూడేనికి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో వైద్యం అందడం లేదని గొత్తికోయలు తెలిపారు. తాము అడవిలో దుర్భర జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. తమ గూడేనికి తాగు నీరు, విద్యుత్ సౌ కర్యం కల్పిస్తామని గతం లో హామీ ఇచ్చిన మంత్రి సీతక్క వాటిని విస్మరించారనారు. కనీసం తాగునీరు, విద్యుత్ సౌకర్యమైనా కల్పించాలని వారు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.