సుబేదారి, డిసెంబర్ 31 : న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు రోడ్లపై గస్తీ నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఖాకీలే కనిపించారు. వరంగల్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు రోడ్లపైన వాహనాలను తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేశారు.
వరంగల్ నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, షీటీమ్స్ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, స్థానిక పోలీసులు విస్తృతంగా గస్తీ చేపట్టారు. నగరంలోని కాజీపేట రైల్వేస్టేషన్, ఫాతిమ, సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్, అదాలత్, అంబేద్కర్, కేయూసీ, హనుమకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ, చింతల్ బ్రిడ్జి, వరంగల్ చౌరస్తా, నాయుడు పెట్రోల్ పంపు, ఉర్సు గుట్ట జంక్షన్లు, హనుమకొండ, వరంగల్ బస్స్టేషన్లు, వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు అర్థరాత్రి దాకా తనిఖీలు చేపట్టారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో డీసీపీలు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ఫోర్స్ విభాగాలకు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యల్లో పాల్గొన్నారు.