హనుమకొండ సబర్బన్/పాలకుర్తి, నవంబర్ 3 : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన ‘ఎక్కడి వడ్లు అక్కడే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు వేయని దుస్థితి కేంద్రాల్లో నెలకొంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో నాగపద్మజ సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం తేమ శాతం లేకుండా తేవాలని చెప్పారు. కేంద్రాల్లో అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ధాన్యం ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారో అధికారులు చెప్పకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలోని ధాన్యం కోనుగోలు కేంద్రా న్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీ దేవానాయక్ మాట్లాడుతూ తేమ శాతం రాగానే కాంటా లు చేపడతామన్నారు. రైతులు ధాన్యం పోసి పది రోజులు గడుస్తున్నా అధికారులు ఈ రోజు వచ్చి తేమ శాతం రాలేదని చెప్పడం గమనార్హం. కార్యక్రమంలో డీపీఎం ప్రకాశ్, ఏపీఎం రవీందర్, ఏఈవో పున్నంచందర్, సీసీ రవీందర్ పాల్గొన్నారు.