నల్లబెల్లి : ఉపాధి హామీ పనులతో పాటు మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహార్తిస్తున్న అధికారులపై డీఆర్డీవో కౌసల్య దేవి(DRDO Kausalya) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 16వ విడత జాతీయ ఉపాధి హామీ పథకం పై సామాజిక తనిఖీ ఇన్ హౌస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈజీఎస్ పనులపై సామాజిక తనిఖీ బృందం వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో గతంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను సంబంధిత ఈజీఎస్ సిబ్బందితోపాటు కార్యదర్శులు నిర్లక్ష్యంతో మొక్కలు చనిపోవడాన్ని ఆమె గుర్తించారు.
అదేవిధంగా పనులకు సంబంధించిన రికార్డులను స్పష్టంగా తయారు చేయకపోవడం ఈజీఎస్ సిబ్బందితోపాటు కార్యదర్శులపై డీఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి నరసింహమూర్తితో పాటు ఎంపీఓ రవిని అన్ని గ్రామాలను సందర్శించి నర్సరీలలో మొక్కల పెంపకంతో పాటు పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, రోడ్లకి ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చనిపోయిన మొక్కల స్థానంలో మరల మొక్కలను నాటాలని ఆదేశించారు. పనులు చేసిన కూలీల వివరాలను స్పష్టంగా రికార్డులో నమోదు చేయాలని సూచించారు. ఎండలు మండిపోతుండడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. సామాజిక బృందం చేపట్టిన ఈజీఎస్ సిబ్బంది గ్రామ కార్యదర్శిల నిర్లక్ష్యం స్పష్టంగా వెల్లడయినందున అధికారుల పనితీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.