సుబేదారి, అక్టోబర్ 26 : మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. కిక్కు ఎవరికి దక్కనున్న దో.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. మద్యం షాపు టెండర్లకు నేడు అధికారులు డ్రా తీయనున్నారు. దీంతో ‘అదృష్టం ఎవరిని వరించునో.. లక్కు ఎవరికి చిక్కనున్నదో’నని దరఖాస్తుదారులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. షాపు తగిలితే పంట పండినట్లే.. లేదంటే రూ.3లక్షలు గోవిందా.. అని లోలోన ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని గంటల్లో భవితవ్యం తేలనుండడంతో అందరిచూపు మద్యం దుకాణాల కేటాయింపుపైనే పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్(వరంగల్ రూరల్), హనుమకొండ (వరంగల్ అర్బన్), జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో 17 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 294 షాపులకు మొత్తంగా 10,493 దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో అత్యధికంగా కాజీపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ బ్రిడ్జి షాపునకు 116 దరఖాస్తులు, అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ దుకాణానికి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల టెండర్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచింది. దీంతో కొన్నిచోట్ల తక్కువ దరఖాస్తులు రావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజులు.. అంటే 23 వరకు పెంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి గడువు 18 వరకు 9,754 దరఖాస్తులు రాగా, పెంచిన గడువు 23 వరకు 10,493 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
2025-27 రెండేళ్ల మద్యం షాపుల టెండర్లకు గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోని ఎక్సైజ్ స్టేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను షాపుల వారీగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో డ్రా పద్ధతిన లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు. దీంతో డ్రా నిర్వహించే ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే సందడి వాతావరణం ఉన్నది. లక్కీ డ్రాలో షాప్ తగిలిన వారికి ఎక్సైజ్ శాఖ నుంచి వెంటనే లైసెన్స్ పత్రాలను అందజేస్తారు. ఇందుకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. హనుమకొండ జిల్లాలో 67 షాపులకు అత్యధికంగా 3,175 దరఖాస్తులు వచ్చాయి.