వరంగల్ చౌరస్తా: భూమి మీద పుట్టిన ప్రతి శిశువుకి తల్లిపాలు అమృతంలా పని చేస్తాయని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సహకారంతో కాకతీయ మెడికల్ కళాశాల సేవార్ధ్ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగు కిలోమీటర్ల వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరై కేఎంసీ నుండి హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ వరకు నిర్వహించిన వాకథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. నేటి ప్రపంచం గుండె మార్పిడికి సైతం శాస్త్ర సాంకేతికతను సాదించినా లిక్విడ్ గోల్డ్ మాదిరి తల్లిపాలను మించిన పౌష్టికాహారాన్ని తయారుచేయలేకపోయిందని అన్నారు.
పిల్లలకు రోగనిరోధక శక్తి పెరగాలంటే తల్లిపాలు అమృతంలా పని చేస్తాయని అన్నారు. కొంత మంది పిల్లలు దురదృష్టవశాత్తు తల్లిపాలకు దూరంకావడం బాధాకరమని అన్నారు. పిల్లలు తల్లిపాలకు దూరం కావడం పిల్లలతో పాటు తల్లికి సైతం అనారోగ్య కారణంగా మారుతాయని అన్నారు. తల్లిపాలకు దూరమైన చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రసూతి హాస్పిటల్స్ మిల్క్ బ్యాంకు లు ఏర్పాటు చేస్తుందన్నారు.
నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చాలా మంది చిన్నారులు తల్లిపాల కోసం ఎదురుచూస్తున్నారని తల్లిపాలు అందని ఆ చిన్నారులకు మనసున్న తల్లులు మిల్క్ బ్యాంకుల ద్వారా తమ పాలను పంచాలని కోరారు. మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కేఎంసీ విద్యార్థులు సేవార్ద్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీరాం రెడ్డి, డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ అనిల్, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ బలరాం నాయక్, క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు అనన్య, డాక్టర్ నవదీప్, కేఎంసీ విద్యార్థులు, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.