హనుమకొండ, నవంబర్ 14: బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఏకం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్, బీసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ అన్నారు. కేయూ ఎస్డీఎల్సీఈ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రాంగణంలో బీసీ విద్యార్థి జేఏసీ ఆరుగంటి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్ష 5వ రోజుకు సంఘీభావంగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి బీసీలంతా ఐక్యమత్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకై జరుగుతున్న పోరాటంలో సంఘీభావంగా బార్ అసోసియేషన్ చైర్మన్ పులి సత్యం, ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరస్వామి, వీసీకే పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్, కేయూ నాన్‌టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బూర నవీన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ యూనస్, తాటి దామోదర్, సతీష్ బాబు పాల్గొన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్, చందా మల్లయ్య సంఘీభావం తెలిపి బీసీ విద్యార్థి జేఏసీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో నాగరాజు పటేల్, కళ్లేపల్లి ప్రశాంత్, సాయి, కాగితపు నాగరాజు, అజయ్, అన్వేష్, రాజశేఖర్, రాజేష్, ప్రకాష్ ఉన్నారు.