న్యూశాయంపేట, మే 24 : పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. నగరంలోని పేదలకు పక్కా ఇండ్లు సమకూర్చాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టింది. హనుమకొండ జిల్లా కేంద్రంలోని 31వ డివిజన్ న్యూశాయంపేట రైల్వేట్రాక్ అవతల కేటాయించిన 8 ఎకరాల్లో నిర్మాణం చేపట్టింది.
560 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని హంగులతో 19 బ్లాకులు, ఒకో బ్లాకులో 32 గృహాలు, మొత్తం 608 మంది నిరుపేదల కోసం ఇండ్లు నిర్మించింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా నేటికీ పంపిణీ చేయలేదని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇందుకు ముందుకు రావడం లేదని అర్హులైన లబ్ధిదారులు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే హనుమకొండ బాలసముద్రం సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు పంపిణీ చేసి ఏడాది అవుతున్నా న్యూశాయంపేటలో పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని, దీంతో అవి నిరుపయోగంగా ఉండడంతో పాటు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నిరుపేదలు, భూములు కోల్పోయినవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.