పరకాల, నవంబర్ 19 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పట్టణంలోని 1,2,12,13,14,15, 22 వార్డుల్లో, సాయంత్రం విలీన గ్రామాలు సీతారాంపురం, రాజీపేట (6,7,8 వార్డులు)లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశానికే మార్గదర్శకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పగలంతా కరెంటు కోతలు ఉండేవని, దీంతో పలు వ్యాపారాలు మూతబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సీఎం అండతో పట్టణ రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. వాడవాడల సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, సెంట్రల్ లైటింగ్‌తో ప్రధాన రహదారులు. కార్పొరేట్ స్థాయిలో పాలనా భవనాలను నిర్మించుకున్నాని పేర్కొన్నారు.
రెవెన్యూ డివిజన్‌ను తిరిగి పునరుద్ధరించుకున్నామని చెప్పారు. ప్రజలు విపక్షాల మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ ఆరు స్కీంల పేరుతో, ఓటు బ్యాంకు లేని బీజేపీ బీసీ కార్డులో ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటల కరెంటు మాత్రమే వస్తుందని, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని, 24గంటల కరెంటు రావాలంటే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటు వేయాలన్నారు. పరకాలలో భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు మడికొండ శ్రీను, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమార్, ఒంటేరు సారయ్య, బండి రాణి, శనిగరపు రజిని, మార్క ఉమాదేవి, చందుపట్ల సుజాత, నాయకులు సోదా రామకృష్ణ, నిప్పాని సత్యనారాయణ, పావుశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గు విజేందర్‌రావు, చందుపట్ల సాయి తిపుపతి రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చల్లాకు పట్టణంలోని పలు వర్గాలు మద్దతు తెలిపాయి. పట్టణ స్వర్ణకార సంఘం, పరకాల, నడికూడ మండలాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ గుమస్తా సంఘం, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన మాల సంఘం, మేర సంఘం బాధ్యులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కుల సంఘాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు.