కాజీపేట, నవంబర్ 12: కాజీపేట రైల్వే స్టేషన్లో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్లాట్ ఫాంలపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులను భయభ్రంతులకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నైలకు వెళ్లే గోదావరి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ తదితర ముఖ్య రైళ్లు వచ్చాయంటే ప్రయాణికులు స్టేషన్లో పడేసిన వ్యర్థ పదార్థ్ధాలను తినేందుకు అక్కడికి చేరుకుంటున్నాయి. రాత్రి వేళల్లో రైలు వచ్చిందంటే కుక్కలు అక్కడికి వచ్చి రాకపోకలు సాగించే వారిని కరుస్తున్నాయి. ప్రయాణికులు కాళ్ల మధ్యనే తిరుగుతుంటాయి. స్టేషన్‌కు రెండు మూడు రైళ్లు ఒక్కసారే రావడంతో రైలు ఎక్కేందుకు పరుగులు పెడుతుంటే కుక్కలను తాకినా, వాటి ముందు పరుగెత్తినా కరుస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. అధికారు లు స్పందించి జంక్షన్లో వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
స్టేషన్లో వీధి కుక్కలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటిని చూసి స్టేషన్‌కు వచ్చే వారు భయపడుతున్నారు. కుక్కల దాడులను అరికట్టేందుకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
– అశోక్, ప్రయాణికుడు
రైల్వే ప్లాట్‌ఫాంలపై వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉంది. అవి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతులు చేతులోని వస్తువులను లాక్కొని వెళ్తున్నాయి. రైల్వే స్టేషన్లో కుక్కలు, కోతుల బెడదను నివారించాలి.
– కృష్ణ, ప్రయాణికుడు