నర్సంపేట, మార్చి 30: నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు డాక్యుమెంట్ రైటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎల్ఆర్ఎస్తో సంబం ధం లేకుండానే ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి, డబ్బులు ముట్టగానే ఎంతటి పనినైనా అవలీలగా చేసేస్తున్నారు.
ప్రతిరోజూ ఈ తతంగమంతా సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఆన్లైన్లో ఇవ్వాల్సిన ఈసీని నగదు తీసుకొని ఏకంగా కార్యాలయంలోనే మాన్యువల్‌గా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ డబ్బులివ్వందే ఏ పనీ కాదని పలువురు బాహటంగానే చర్చించుకుంటున్నారు. రూ. 220 చలానా కడితే ఇవ్వాల్సిన మ్యారేజ్ సర్టిఫికెట్‌కు డాక్యుమెంట్ రైటర్లు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు తీసుకుంటున్నారు.
రైటర్లదే హవా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైట ర్లు కీలకంగా మారారు. నర్సంపేటలో లైసెన్స్ ఉన్న వారు ముగ్గురుండగా, అనధికారికంగా మరో 25 మంది కొనసాగుతున్నారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే వే దంలా భావించి పనులు చేసేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు నిత్యం వివిధ రకాల ఫైళ్లతో కార్యాలయంలోనే తిరుగుతుంటారు. ఏ పని జరగాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా రైటర్లను కలిసి వారు నిర్ణయించిన రేటు ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందే.
ఒకవేళ ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ పని పెండింగ్‌లో పడిపోవాల్సిందే. కాగా, వసూలు చేసిన డబ్బుల నుంచి కమీషన్ రూపంలో కొంతమొత్తం సబ్ రిజిస్ట్రార్ సహా సిబ్బందికి అందుతాయని పలువురు విమర్శిస్తున్నారు. పనివేళలు ముగిసిన అనంతరం కార్యాలయంలోని ఓ గదిలో పంపకాలు జరుగుతాయని ఆరోపిస్తున్నారు.
ఫోర్జరీ సంతకాలతో అక్రమాలు
ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఫోర్జరీ సంతకాలతో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచా రం జరుగుతున్నది. వీరిద్దరూ డివిజన్లోని రెం డు మండలాల్లోని పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శుల స్టాంప్‌లు దొంగచాటుగా తయారు చేసి వినియోగిస్తున్నట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్‌కే తెలియకుండా అడ్డదారిలో ఇళ్లు, భూములు రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత లోన్లు కూడా ఇప్పించి లక్షలు దండుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయంలో జరుగుతున్న తతంగాన్ని నిలువరించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.